సెన్సార్ అడ్డంకులు దాటిన 'జన నాయగన్'.. జూలై 24న విజయ్ సినిమా?

  • సెన్సార్ పూర్తి చేసుకున్న విజయ్ 'జన నాయగన్'
  • మూడు గంటల నిడివితో రానున్న పొలిటికల్ డ్రామా
  • జూలై 24న థియేటర్లలోకి వచ్చే అవకాశం
  • నెలల తరబడి ఉన్న అడ్డంకులు తొలగిపోవడంతో ఫ్యాన్స్ హ్యాపీ
తమిళనాడు ముఖ్యమంత్రి, ప్రముఖ నటుడు విజయ్ చివరి చిత్రం 'జన నాయగన్' విడుదలకు ఎదురైన ప్రధాన ఆటంకాలు తొలగిపోయాయి. పలుమార్లు వాయిదా పడిన ఈ చిత్రం తాజాగా సెన్సార్ ప్రక్రియను పూర్తి చేసుకుంది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్‌సీ) ఈ సినిమాకు 'ఏ' సర్టిఫికెట్ జారీ చేయడంతో, విడుదలకు మార్గం సుగమమైంది.

ఈ పొలిటికల్ యాక్షన్ డ్రామా నిడివి 183 నిమిషాలుగా (3 గంటల 3 నిమిషాలు) ఖరారైంది. హెచ్. వినోద్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా నటించగా, మమితా బైజు, బాబీ డియోల్ కీలక పాత్రలు పోషించారు. కేవీఎన్ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మితమైన ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. జూలై 24న ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. అయితే, దీనిపై చిత్ర నిర్మాణ సంస్థ నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

నిజానికి ఈ సినిమాను 2026 జనవరి 9న సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని తొలుత భావించారు. అయితే, సెన్సార్ సమస్యలు, న్యాయపరమైన చిక్కులు, సీబీఎఫ్‌సీ రివైజింగ్ కమిటీ సమీక్ష వంటి కారణాల వల్ల విడుదల వాయిదా పడుతూ వచ్చింది. చిత్రంలో కొన్ని మార్పుల చేసిన అనంతరం బోర్డు ఈ సినిమాకు 'ఏ' రేటింగ్ కేటాయించినట్లు సమాచారం.

Vijay
Jana Nayagan
H Vinoth
Pooja Hegde
Anirudh Ravichander
Jana Nayagan Release Date

More Telugu News